: మిస్సైళ్లను కన్ ఫ్యూజ్ చేసే విమానంలో పాక్ పర్యటనకు సుష్మా!


భారత్, పాకిస్థాన్ ల మధ్య నిత్యం తుపాకులు గర్జిస్తున్నాయి. సరిహద్దు వద్ద కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లో భారత సైన్యానికి పెను నష్టం సంభవిస్తున్నా, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు సజీవంగా పట్టుబడ్డారు. అంతేకాక ఇరు దేశాల మధ్య అప్పటిదాకా జరుగుతూ వస్తున్న చర్చలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ పలకరింపు ఇరు దేశాల మధ్య మళ్లీ సుహృద్భావ వాతావరణానికి నాంది పలికింది. బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు భేటీ అయ్యారు. ఆ వెనువెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనకు బయలుదేరారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ తోనూ భేటీ అయ్యారు. సురక్షితంగా భారత్ తిరిగివచ్చేశారు. అసలు ఈ విషయమంతా తెలిసిందేగా అనుకుంటున్నారా? తెలియని ఓ అంశం కూడా ఉంది. అదేంటంటే, పాక్ పర్యటన కోసం సుష్మా స్వరాజ్ వినియోగించిన విమానంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ ను వెంటబెట్టుకుని వెళ్లిన సుష్మ, భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన విమానంలో పాక్ చేరుకున్నారు. అదే విమానంలో తిరిగి వచ్చారు. అయినా ఈ విమానం ప్రత్యేకత ఏమిటో తెలుసా? విమానాల విధ్వంసానికి వినియోగించే మిస్సైళ్ల (క్షిపణులు)ను కన్ ఫ్యూజ్ చేస్తుందట. అంటే లక్ష్యం దిశగా దూసుకువచ్చే మిస్సైళ్ల నుంచి ఈ విమానం సురక్షితంగా బయటపడుతుందట. మిస్సైళ్లను దారి మళ్లించేసి, ఎంచక్కా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే పాక్ పర్యటనలో సుష్మ ఈ విమానాన్ని వినియోగించారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ విమానాన్ని వినియోగించాలంటే ప్రధాని నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది. అధికారుల నివేదిక ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానంలో సుష్మ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. బ్రెజిల్ కంపెనీ తయారుచేసిన 14 సీట్ల కెపేసిటీ గల ఈ విమానం ఖరీదు సుమారు 140 కోట్లు. ఇటువంటి ఐదు విమానాలను 2005లో భారత్ కొనుగోలు చేసింది.

  • Loading...

More Telugu News