: రాహుల్ గాంధీతో మోదీ షేక్ హ్యాండ్!... పొలిటికల్ వైరివర్గంతో వేదిక పంచుకున్న ప్రధాని
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన రాజకీయ వైరి వర్గం మొత్తం ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జన్మదిన వేడుక వేదికైంది. రాజకీయంగా పరుష పదజాలంతో దూషించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులంతా ఒకే వేదికపై కనిపించారు. ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న సందర్భంగా మోదీ అందరితో కరచాలనం చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కాస్త ముభావంగా కనిపించినా, రాహుల్ మాత్రం తన వద్దకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. మరో అడుగు ముందుకేసిన మోదీ, రాహుల్ కు షేక్ హ్యాండిచ్చారు. ఈ దృశ్యం అక్కడున్నవారికి కనువిందు చేసింది.