: అన్ని శాఖల్లోకీ నా శాఖే అత్యంత అవినీతిమయమైన శాఖ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
దేశంలోని అన్ని శాఖల్లోకీ తన శాఖే అత్యంత అవినీతిమయమైన శాఖ అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మీద అత్యంత అవినీతి జరిగేది రవాణాశాఖ కార్యాలయాల్లోనేనని ఆయన మండిపడ్డారు. రవాణాశాఖాధికారులు బందిపోటు దొంగలను మించిపోయారని ఆయన మండిపడ్డారు. ఆర్టీవో అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోటారు వాహనాల నూతన చట్టం ద్వారా రవాణా శాఖలో సంస్కరణలు తీసుకువస్తామని ఆయన తెలిపారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు చాలా సులువుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో 30 శాతం భోగస్ వేనని ఆయన వెల్లడించారు. నూతన చట్టం అమల్లోకి రాకుండా రాష్ట్రాల్లోని మంత్రులపై ఆర్టీఏ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. నూతనచట్టం అమల్లోకి వస్తే వారి పప్పులు ఉడకవని ఆయన స్పష్టం చేశారు.