: కసబ్ బతికే ఉన్నాడు...కావాలంటే తీసుకొస్తా: కోర్టుకి తెలిపిన పాక్ టీచర్
ముంబై మారణహోమానికి పాల్పడిన అజ్మల్ కసబ్ బతికే ఉన్నాడా? అంటే లేడనే చెబుతారు ఎవరైనా సరే. ఎందుకంటే, మూడేళ్ల క్రితం కసబ్ ను పూణే జైల్లో ఉరితీసేశారు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కసబ్ మృతి చెందలేదని, కావాలంటే చూపిస్తానని న్యాయస్థానానికి తెలిపాడు. దీనిపై పాకిస్థాన్ లోని రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు విచారణ చేపట్టింది. 2008 నవంబర్ 26న ముంబైపై లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టే పిట్టల్లా కాల్చేశారు. దీంతో 166 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో భారత పోలీసుల సాహసంతో ఉగ్రవాది అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. దీంతో కసబ్ ను దోషిగా నిర్ధారిస్తూ 2012 నవంబర్ లో ఉరితీశారు. అయితే 2014 మేలో పాకిస్థాన్ లో ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు ముదాస్సిర్ లఖ్వీ, కసబ్ బతికే ఉన్నాడంటూ స్థానిక న్యాయస్థానానికి తెలిపాడు. ఆ పాఠశాలలో కసబ్ మూడేళ్లు విద్యనభ్యసించడంతో స్పందించిన న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టి నిజాలు నిర్ధారించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల విచారణలో ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో లఖ్వీకి సమన్లు జారీ చేశారు. అయితే లఖ్వీ మాత్రం కసబ్ బతికే ఉన్నాడని, కొన్ని రోజుల క్రితమే తాను అతనిని కలిశానని, కావాలంటే న్యాయస్థానంలో హాజరుపరుస్తానని చెబుతున్నాడు. దీంతో లఖ్వీ చెబుతున్న కసబ్, ముంబైలో ఉరితీసిన కసబ్ ఒకడేనా? అనే అనుమానం కలుగుతోంది.