: ఈ-కామర్స్ దెబ్బ...లోకల్ మార్కెట్లు అబ్బా!


హైదరాబాదులో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు కావాలన్నా ఆబిడ్స్ లోని జగదీష్ మార్కెట్, సికింద్రాబాద్ లోని చెనాయ్ ట్రేడింగ్ సెంటర్ (సీటీసీ)కి వెళ్లాలి. అలాంటి కొనుగోలుదారులతో ఈ ప్రదేశాలు నిత్యం కళకళలాడేవి. రెండేళ్ల క్రితం వరకు చెనాయ్ సెంటర్ కు నిత్యం వచ్చేవారి సంఖ్య ఎనిమిది నుంచి పది వేల వరకు ఉండేది. అయితే, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కొనుగోలు నిమిత్తం పదిహేను వందల నుంచి రెండు వేల మంది మాత్రమే అక్కడికి వస్తున్నారు. దీంతో వారి వ్యాపారం తగ్గిపోయింది. కొన్ని షాపులైతే ఇప్పటికే మూసేశారు. వారి వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడానికి, దుకాణాలు మూసివేసుకునే పరిస్థితికి కారణాల వైపు దృష్టి సారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారి వ్యాపారాలు మూతపడటానికి ప్రధాన కారణం... ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగుతుండటమే. అంతేకాకుండా, బయటి ధరలతో పోలిస్తే ఆన్ లైన్ ధరలు చాలా తక్కువగా ఉండటంతో కోలుకోలేని దెబ్బ ఈ మార్కెట్లపై పడింది. ఈ సందర్భంగా జగదీష్ మార్కెట్, సీటీసీ వ్యాపారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం సరిగ్గా సాగడం లేదని, దుకాణం అద్దె చెల్లించడం కూడా కష్టంగా ఉందని ఒకరు... తనకు నాలుగు సొంత దుకాణాలుండగా అందులో రెండింటిని ఇప్పటికే మూసేశానని మరొకరు వాపోయారు. ఐదేళ్ల క్రితం ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ సంస్థలు రిలయన్స్ డిజిటల్, క్రోమా, బజాజ్ వంటివి మార్కెట్ లోకి వచ్చినప్పుడు కూడా తమ వ్యాపారం ఎలా సాగుతుందోనని చాలా భయపడ్డామని కొందరు వ్యాపారులు చెప్పారు. అయితే, ఆయా విక్రయ సంస్థల్లో అంత ధరలు పెట్టి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు కనుక, తమ వ్యాపారాలు నిలబడ్డాయన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి ఆ విధంగా లేదని, ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం ద్వారా ఆయా వస్తువులు నేరుగా ఇంటికే చేరడం, వాటి ధర తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల తమ వ్యాపారాలకు తీవ్రమైన దెబ్బతగిలిందని అన్నారు. అయితే, ఆన్ లైన్ లో ఒక వస్తువును బుక్ చేస్తే మరొక వస్తువు డెలివరీ అవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయన్నారు. అయినప్పటికీ, ఆన్ లైన్ కొనుగోళ్లకే వినియోగదారులు ఆసక్తి చూపుతుండటం దురదృష్టకరమని ఆ వ్యాపారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News