: హైడ్రోజన్ బాంబులపై దృష్టి పెట్టిన ఉత్తరకొరియా!
ప్రస్తుతమున్న అణుబాంబులతో పోలిస్తే మరిన్ని రెట్ల విధ్వంసం సృష్టించే హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశపు నేత కిమ్ జాంగ్ ఉన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. "దేశాన్ని రక్షించేందుకు అణ్వాయుధాలు మన దగ్గరున్నాయి. ఇక మరింత భద్రత కోసం హెచ్-బాంబును తయారు చేస్తున్నాం" అని ఆయన గురువారం నాడు వ్యాఖ్యానించారు. ఇప్పటికే మూడు దఫాలు అణు పరీక్షలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, హైడ్రోజన్ బాంబు ధర్మోన్యూక్లియర్ డివైజ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాంబు పేలితే ఏర్పడే చైన్ రియాక్షన్ వల్ల మరింత నష్టం సంభవిస్తుంది. ఇప్పటికే నార్త్ కొరియా వద్ద పెను విధ్వంసం సృష్టించే ఆయుధాలు ఎన్నో ఉన్నాయని అమెరికా తదితర దేశాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక ప్లూటోనియం ఆధారిత అణు బాంబులు పక్కనపెట్టి, హైడ్రోజన్ అణు బాంబులను తయారు చేస్తుండటం, అగ్రరాజ్యాలకు మరింత ఆందోళన కలిగించే అంశమే.