: హాట్ కేకుల్లా దావూద్ ఆస్తులు!...హోటల్ ను రూ.4.28 కోట్లకు దక్కించుకున్న మాజీ జర్నలిస్ట్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని పలు ఆస్తులు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ముంబైలో దావూద్ కు చెందిన మొత్తం 7 ఆస్తులను నిన్న వేలం వేయగా, వాటిలో ప్రధానమైన ‘రౌనక్ అఫ్రోజ్’ హోటల్ ను ఒకప్పటి జర్నలిస్ట్, ప్రస్తుత ఉద్యమకారుడు బాలక్రిష్ణన్ దక్కించుకున్నారు. రూ.1.18 కోట్ల ప్రారంభ ధరతో వేలానికి వచ్చిన దీని కోసం ఆయన ఏకంగా రూ.4.28 కోట్లను వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ హోటల్ ను దక్కించుకునేందుకు దాఖలైన బిడ్లలో అత్యధిక ధరను కోట్ చేసిన బాలక్రిష్ణన్ డాన్ హోటల్ ను దక్కించుకున్నారు. ఇక దావూద్ గతంలో వాడినట్లుగా భావిస్తున్న హ్యుందాయి యాక్సెంట్ కారును హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి రూ.3.32 లక్షలు వెచ్చించి కొనుక్కున్నారు. మాతుంగ ప్రాంతానికి చెందిన మహావీర్ బిల్డింగ్ లో దావూద్ కు చెందిన 32.77 చదరపు మీటర్లున్న గదికి ప్రారంభ ధరగా రూ.50.44 లక్షలను నిర్ణయించగా, సదరు గది కూడా వేలంలో అమ్ముడుబోయింది.