: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్... ఓయూ గేట్లను మూసేసిన పోలీసులు


ఉస్మానియా యూనివర్సిటీలో ఓ వర్గం విద్యార్థులు నేడు నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిన్న రాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ వైపు ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఆ విద్యార్థులు చెబుతుండగా, దానిని అడ్డుకుని తీరతామని గోసంరక్షణ సమితి నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు నిన్న సాయంత్రమే రంగంలోకి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా, బయటి వ్యక్తులు వర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లకుండా వర్సిటీ గేట్లను మూసేశారు. బీఫ్ ఫెస్టివల్ కు సిద్ధమవుతున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. వర్సిటీ లోపలికి మీడియాకు కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. వర్సిటీ అన్ని గేట్లను మూసేసిన పోలీసులు సాధారణ ప్రజలను కూడా వర్సిటీ మీదుగా అనుమతించడం లేదు. ఇక గోసంరక్షణ సమితి నేతలకు మద్దతుగా ప్రకటనలు గుప్పించిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. నేటి తెల్లవారుజాముననే ఆయనకు గృహనిర్బంధం విధించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పటిష్ట భద్రత మధ్య ఎమ్మెల్యేను షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News