: చిరుతతో పోరాడి, బిడ్డను రక్షించుకున్న వీరమాత!


కన్న బిడ్డపై తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం. ఎందుకంటే, అది అనంతం కనుక! మరి, అటువంటి బిడ్డను ఒక చిరుత పులి ఈడ్చుకుపోతున్న సంఘటన తన కళ్ల ముందే జరుగుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోయింది... కాళికలా మారింది. చిరుతపై దాడి చేసి తన బిడ్డను రక్షించుకున్న ఆ వీరమాత గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని మోతీపూర్ పరిధిలో ఉన్న ఒక గ్రామంలో జరిగింది. ఇదే పరిధిలో కాట్రాయన్ ఘాట్ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం కూడా ఉంది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఫూల్ మతి (30) అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలు గుడియా, రిచాలను తీసుకుని పొలానికి బయలుదేరింది. అంతలో అక్కడకు దగ్గర్లో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యంలో నుంచి వచ్చిన ఒక చిరుత వాళ్లపై దాడిచేసి, నాలుగేళ్ల గుడియాను ఈడ్చుకుంటూ పోవడానికి ప్రయత్నించింది. దీంతో, ఏమి చెయ్యాలో పాలుపోని ఫూల్ మతి.. సాయం కోసం గట్టిగా కేకలు పెట్టింది. కానీ, ఎవ్వరూ స్పందించలేదు. దీంతో, తన చేతికి ఏది దొరికితే దానిని తీసుకుని చిరుతపై విసిరిగొట్టింది. రాళ్లు, కర్రలను చిరుతపై విసిరిగొడుతూ సుమారు అరగంటపాటు ఆమె పోరాడింది. ఈలోగా అక్కడికి వచ్చిన ఫూల్ మతి కుటుంబసభ్యులు ఆమెకు తోడవడంతో చిరుత వెనుతిరిగింది. గాయపడ్డ గుడియాను ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడిలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News