: కేంద్రం ఇచ్చిన హామీలను సాధించేవరకు పోరాడతాం: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాడు కేంద్ర ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చిందో వాటన్నింటిని సాధించుకునే వరకు తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన జనచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములు సేకరించిన ఘనత ‘చంద్రన్న’ది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలు వచ్చే లోగా ఇక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు పూర్తి చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావని, కేంద్రం నిధులు కూడా సమకూర్చాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తే మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని, అవసరమైన ఆర్థిక నిధులు రావని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ విభేదిస్తే కనుక అక్కడ రెండు మంత్రి పదవులు తీసుకుందామని వైఎస్ జగన్ ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. వచ్చే సంవత్సరంలో రేణిగుంటలో సెల్ ఫోన్ కంపెనీని ప్రారంభించనున్నారని, ఆ కంపెనీ ద్వారా యువతకు సుమారు 30 వేల ఉద్యోగాలను కల్పించే బాధ్యత చంద్రబాబు తీసుకోనున్నారన్నారు. కడపలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు.