: ఆ మూడు దేశాలు గ్రేట్...అలాగే చైనా ప్రజలు కూడా మంచివాళ్లే!: దలైలామా
భారత్, అమెరికా, జపాన్ దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. బెంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మూడు దేశాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పరిపాలన, భావ ప్రకటన స్వేచ్ఛ తదితర అంశాల్లో ఒకే విధమైన అభిప్రాయం కలిగి ఉన్నాయని, అందుకే ఈ మూడు దేశాలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆసియాలో ప్రజాస్వామ్యం మీద స్థిరమైన నమ్మకం కలిగిన ఏకైక దేశంగా భారత్ నిలుస్తోందని ఆయన చెప్పారు. జపాన్ పారిశ్రామికీకరణ చెందిన ప్రజాస్వామ్య దేశమని, అమెరికా స్వేచ్ఛ, సమానత్వం కలిగిన ప్రజాస్వామ్య దేశమని దలైలామా పేర్కొన్నారు. ఈ మూడు దేశాలు అంశాల వారీగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చైనా నిరంకుశత్వం కలిగిన దేశమని ఆయన పేర్కొన్నారు. చైనా గొప్పదేశమని, అక్కడి ప్రజలు గొప్పవారని, శ్రమపడే తత్వం కలిగిన వారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఈ రోజుల్లో అంగీకరించలేమని ఆయన స్పష్టం చేశారు.