: రాజమౌళితో మాట్లాడి 'బాహుబలి' షో ఏర్పాటు చేస్తున్న నాటి హీరోయిన్ రాశి


బాహుబలి చిత్రం ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని, నాటి నటి రాశి కలిసినట్లు సమాచారం. సినిమా అవకాశాలివ్వమనో లేక మరెందుకో ఆయన్ని కలవలేదు. ఒక చిన్న కోరిక నెరవేర్చమని అడిగేందుకే ఆమె వెళ్లింది. అదేమిటంటే... అనాథ బాలల కోసం ‘బాహుబలి’ స్పెషల్ షో వేయాలని రాజమౌళికి ఆమె విన్నవించుకుంది. అసలు, అనాథ బాలలకు ఈ సినిమా చూపించాలన్న ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రాశి పేర్కొంటూ.. తన కూతురు మొదటి బర్త్ డే సందర్భంగా కొన్నాళ్ళ క్రితం ఒక అనాధ శరణాలయంలో బాలలకు మంచి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశానని తెలిపింది. కట్ చేస్తే.. ఇటీవల అదే అనాధ శరణాలయానికి వెళ్లిన రాశి అక్కడి పిల్లలతో కొద్దిసేపు మాట్లాడింది. ఇప్పటివరకు, ఒక్క సినిమా కూడా తాము థియేటర్లో చూడలేదని వారు చెప్పారు. అప్పటికే బాహుబలి చిత్రం విడుదలవడం దానికి సూపర్ హిట్ టాక్ రావడంతో, ఆ సినిమాని థియేటర్లలో చూడాలన్న తమ కోరికను వారు వ్యక్తం చేశారు. అయితే, బాహుబలి సినిమా అక్కడున్న థియేటర్లలో ఎక్కడా ఆడటం లేదు. దీంతో, ఏమి చేస్తే బాగుంటుందా అని ఆలోచించిన రాశికి ఈ ఐడియా వచ్చింది. వెంటనే రాజమౌళిని కలిసి అనాధ బాలల కోసం తన చిన్న కోరికను తీర్చాలంటూ ఆయన్ని రిక్వెస్ట్ చేసింది. ఇందుకు.. రాజమౌళి ‘సరే’ అన్నారని, చిత్ర నిర్మాతలతో మాట్లాడి ప్రసాద్ ల్యాబ్స్ లో బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి చిత్రాలతో హీరోయిన్ గా రాశి పాప్యులర్ అయింది. వివాహం చేసుకుని సినిమాలు తగ్గించుకుంది. ఆమె ఓ పాపకు తల్లి అయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News