: తేరుకోని మార్కెట్... 2 రోజుల్లో రెండున్నర లక్షల కోట్ల నష్టం!


భారత స్టాక్ మార్కెట్ నష్టాల పర్వం ముగియలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న స్తబ్దత ప్రభావం చూపడంతో పాటు, ముడి చమురు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు మరో సెషన్ లోనూ ఇన్వెస్టర్ల సంపదను హరించి వేశాయి. బుధవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1.45 లక్షల కోట్ల మేరకు తగ్గింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో భారత మార్కెట్ ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారి సంపద రూ. 2.50 లక్షల కోట్లకు పైగా తగ్గినట్లయింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 274.28 పాయింట్లు పడిపోయి 1.08 శాతం నష్టంతో 25,036.05 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 89.20 పాయింట్లు పడిపోయి 1.16 శాతం నష్టంతో 7,612.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.76 శాతం, స్మాల్ క్యాప్ 2.24 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 5 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. బీహెచ్ఈఎల్, టీసీఎస్, ఐటీసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 96,71,518 ఉండగా, అది 95,27,980 కోట్లకు పడిపోయింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,79,857 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 2,917 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 542 కంపెనీలు లాభాలను, 2215 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

  • Loading...

More Telugu News