: సంచలనం రేపుతున్న 'నేషనల్ హెరాల్డ్' కేసు వివరాలు ఇవే...!
దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసు నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలు సైతం యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? దీంతో సోనియా, రాహుల్ లకు ఉన్న సంబంధమేమిటి? ఇందులో సుబ్రహ్మణ్యస్వామి పాత్ర ఏమిటి? అనే వివరాలను ఓ సారి చూద్దాం. 1938లో కాంగ్రెస్ పార్టీ సొంత నిధులతో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 'అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్' పేరుతో ఓ కంపెనీనీ స్థాపించారు. ఆ సంస్థ వెలువరించిన మూడు పత్రికలలో నేషనల్ హెరాల్డ్ ఒకటి. స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతున్న సమయంలో, నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికగా ఉండేది. తదనంతర కాలంలో అది క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో, 2008 ఏప్రిల్ 1న దీన్ని మూసివేశారు. అయితే, ఈ సంస్థకు ముంబై, ఢిల్లీ, లక్నోలాంటి పలు నగరాల్లో రెండు వేల కోట్ల విలువైన భూములు వున్నాయి. ఈ క్రమంలో, 2010లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు 'యంగ్ ఇండియా లిమిటెడ్' కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీలో వీరిద్దరి వాటా 76 శాతం కాగా... మిగిలిన 24 శాతం వాటాను కాంగ్రెస్ నేతలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ పెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో, రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ను కేవలం రూ. 50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్ సొంతం చేసుకుంది. అసలు సినిమా ఇక్కడే మొదలైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈ విషయంలో తలదూర్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకోవడమే ఈ వ్యవహారం వెనకున్న కుట్ర అంటూ 2012లో స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ట్రయల్ కోర్టు... తమ ముందు హాజరు కావాలంటూ సోనియా, రాహుల్ లతో పాటు మిగిలిన నలుగురికీ గత ఏడాది జూన్ లో సమన్లు జారీ చేసింది. అయితే, కింది కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే విధించాలని కోరుతూ వీరు హైకోర్టుకు వెళ్లారు. యంగ్ ఇండియా సంస్థ ఒక ఛారిటీ అని... దీని వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని... అయితే షేర్ల బదలాయింపు మాత్రం కమర్షియల్ లావాదేవీలా కొనసాగిందని చెప్పారు. తాము చట్టానికి వ్యతిరేకంగా చేసిందేమీ లేదని... కేవలం రాజకీయ కారణాలతోనే సుబ్రహ్మణ్యస్వామి తమపై కేసు పెట్టారని కాంగ్రెస్ నేతలు వాదించారు. అయితే, నేషనల్ హెరాల్డ్ కు ఇచ్చిన వడ్డీ రహిత రుణం రూ. 90.25 కోట్లను యంగ్ ఇండియాకు ఎందుకు బదిలీ చేశారని జడ్జి ప్రశ్నించారు. ఈ క్రమంలో డిసెంబర్ 19న కింది కోర్టు ఎదుట హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు.