: అంధ 'బాబా వంగ' కాలజ్ఞానం నిజమవుతోందా?


ఆమె పేరు 'బాబా వంగ'. బల్గేరియా నివాసి. అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. తన 12 ఏళ్ల వరకూ అందరిలానే ఆడుకుంది. ఆ సమయంలో వచ్చిన టోర్నడో ఆమె చూపును లాగేసుకుంది. ఆ తర్వాత ఆమె అనూహ్యంగా కనపడకుండాపోయింది. ఆపై ఎన్నో రోజులకు ఆమె కుటుంబ సభ్యుల కంట పడింది. దుమ్ము, ధూళి కంట్లో పెద్దఎత్తున చేరగా, ఆమె చూపును కోల్పోయింది. ఆ తరువాత ఆమె భవిష్యత్ గురించి కాలజ్ఞానం చెప్పడం ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి అప్పట్లోనే ఆమె చెప్పిందట. ఆపై కొంతకాలం బల్గేరియాలో కమ్యూనిస్టు పార్టీ నేతలకు సలహాదారుగా పనిచేసిందట. తన 50 ఏళ్ల కెరీర్ లో వందలాది భవిష్యత్ అంచనాలు చెప్పగా, ఎన్నో నిజమయ్యాయట. ఆమె ఇప్పుడు బల్గేరియాలో నోస్ట్రడామస్ (మన పోతులూరి వీరబ్రహ్మంలా ఆయన ఫ్రెంచ్ కాలజ్ఞాని)తో సమానం. ఆమె చెప్పిన విషయాలన్నీ ఏదోనాటికి జరుగుతాయని అందరూ నమ్ముతున్నారు. 2004లో బాక్సింగ్ డే సునామీని సైతం ఆమె ముందే ఊహించి చెప్పారట. "భయంకరం, భయంకరం... అమెరికాపై ఉక్కు పక్షులు దాడి చేస్తాయి" అన్న ఆమె మాటలు న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11 ఉగ్రదాడికి సంకేతమని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆమె 1996లో మరణించగా, అంతకు కొద్ది రోజుల ముందు పదేళ్ల ఓ ఫ్రెంచ్ అంధ బాలిక తన వారసురాలిగా వస్తుందని చెప్పిందట. ఇక ప్రస్తుతానికి వస్తే, ఆమె అప్పటి కాలజ్ఞానం వివరాలు, ఇప్పుడు దినపత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. 2043 నాటికి రోమ్ రాజధానిగా ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటవుతుందని ఆమె బతికుండగా అంచనా వేసిందట. అంతకన్నా ముందు 'గ్రేట్ ముస్లిం వార్' జరుగుతుందని, ముస్లింలంతా యూరప్ వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆమె అంచనా వేసింది. 2130 నాటికి ప్రజల జీవనం మహాసముద్రాల అట్టడుగుకు చేరిపోతుందని బాబా వంగ కాలజ్ఞానం చెబుతోంది. భూమిపై ఉన్న సమస్తమూ మంచుముద్దలా కరిగిపోతుందని, ఎంతో మంది అమాయకుల రక్తం ఏరులై పారుతుందని భవిష్యత్తును ఊహించినట్టు ఆమె అనుయాయులు చెబుతున్నారు. 2016 ముగిసేలోగా అణు యుద్ధం మొదలవుతుందని, గ్రహాంతర వాసులు వచ్చి నీటి కింద జీవనానికి సహకరిస్తారని, 3005 నాటికి అంగారకుడిపై ప్రపంచయుద్ధం జరుగుతుందని వంగ ఎప్పుడో చెప్పారట. కాగా, ఆమె బతికుండగా, అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ - అమెరికన్ వస్తాడని, అతనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడని అంచనా వేసిందట. అమె చెప్పినట్టుగానే నల్లజాతి సంతతికి చెందిన ఒబామా 44వ అధ్యక్షుడయ్యారు. ఇక అతనే చివరి అధ్యక్షుడా? అంటే...!

  • Loading...

More Telugu News