: వేలానికి దావూద్ ఇబ్రహీం హోటల్... కొనుక్కునే వారేరీ?


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు తన పుట్టినిల్లు అయిన ముంబైలోనూ పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టాడు. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయిన అతడు ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడు. అయితే ముంబై దాడుల తర్వాత అతడికి చెందిన ఓ రెస్టారెంటును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పాక్మోడియా ప్రాంతానికి చెందిన ‘భెందీ బజార్’లో ‘ఢిల్లీ జెయికా’ పేరిట నిర్మితమైన సదరు రెస్టారెంట్ దావూద్ కు చెందినదిగానే పోలీసులు భావిస్తున్నారు. తాజాగా ఈ హోటల్ ను వేలం వేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. వేలంలో పాల్గొనదలచిన వారు దరఖాస్తులు దాఖలు చేయడానికి నిన్న సాయంత్రం (డిసెంబర్ 8)తో గడువు ముగిసింది. నేడు ఈ హోటల్ ను వేలం వేయనున్నారు. ముంబయ్ కి చెందిన మాజీ జర్నలిస్టు ఎస్.బాలకృష్ణన్, ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాత్సవ, హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఈ రెస్టారెంటును దక్కించుకోవడానికి బిడ్స్ వేసిన వారిలో వున్నారు. దీని వేలం నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు సీబీఐ అప్పగించింది. ఈ హోటల్ కు వేలంలో ప్రారంభ ధర రూ.1.18 కోట్లుగా నిర్ణయించారు. ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఆస్తుల విక్రయమంటే పెద్ద సంఖ్యలో బిడ్లు పోటెత్తడం సర్వసాధారణం. అయితే దావూద్ ఆస్తి అయిన ఈ హోటల్ కోసం అతి కొద్ది మంది మాత్రమే బిడ్లను దాఖలు చేశారట. బిడ్లు దాఖలు చేసిన వారిలోనూ ఎంత మంది హాజరవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. నేటి సాయంత్రానికి గాని ఈ హోటల్ అమ్ముడుబోతుందా? లేదా? అన్న విషయం తేలనుంది.

  • Loading...

More Telugu News