: సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసులో లొసుగులని ఎత్తి చూపిన హైకోర్టు న్యాయమూర్తి
2002 నాటి హిట్ అండ్ రన్ కేసు నుంచి కండల వీరుడు సల్మాన్ ఖాన్ బయటపడేందుకు మార్గం మరింత సుగమమయింది. ట్రయల్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్షపై ప్రస్తుతం ముంబై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఏఆర్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ కు జరిపిన రక్త పరీక్షల ఫలితాల్లో ఎంతో వ్యత్యాసం ఉందని, ఆ రోజు ఓ బార్ లో సల్మాన్ మద్యం తాగినట్టు బలమైన సాక్ష్యాలు చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఆయన అన్నారు. ప్రాసిక్యూషన్ విట్ నెస్ (పీడబ్ల్యూ) నంబర్ 20గా సర్ జేజే హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ శశికాంత్ జే పవార్ తన విచారణలో భాగంగా, సల్మాన్ రక్తాన్ని పరీక్ష నిమిత్తం రెండు నాళికల్లో మూడు మిల్లీమీటర్ల చొప్పున సేకరించినట్టు చెప్పగా, అనలిస్టుకు మాత్రం ఒక నాళికలో నాలుగు ఎంఎం రక్తం మాత్రమే చేరింది. కేసులో ఇది ఒక సమాధానం లేని ప్రశ్న కాగా, రక్త పరీక్షల ఫలితాల అనంతరం ఎన్నో మిస్సింగ్ లింకులు కనిపిస్తున్నాయని జోషి అభిప్రాయపడ్డారు. నిందితుడి రక్తాన్ని జాగ్రత్తగా దాచడంలో పోలీసులు విఫలమయ్యారని, జుహూ పరిధిలోని మారియట్ హోటల్ పార్కింగ్ అటెండెంట్ చెప్పిన సాక్ష్యంతో సల్మాన్ కారును నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఇక రెయిన్ బార్ లో వెయిటర్లు, మేనేజర్ చెప్పిన సాక్ష్యాలు, చూపిన బిల్స్ తో నిందితుడు ఎంత తాగాడన్న విషయాన్ని విశ్లేషించగలమా? లేదా? అన్నది ట్రయల్ కోర్టు విస్మరించినట్టు కనిపిస్తోందని జడ్జి అభిప్రాయపడ్డారు. బార్ వెయిటర్ రెండు రకాల సాక్ష్యాలు చెప్పాడని కూడా తాను గుర్తించినట్టు జోషి తెలిపారు. బార్ కు రెగ్యులర్ గా వెళ్లేవారు మద్యం సేవించేందుకే వెళ్తారని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవని డిఫెన్స్ చేసిన వాదనతో తానూ ఏకీభవిస్తానని చెప్పారు. ఇక ఇన్ని లొసుగులను స్వయంగా న్యాయమూర్తి గుర్తించి వెల్లడిస్తూ, పక్కాగా ఆధారాలు లేవని వ్యాఖ్యానించిన వేళ, సల్మాన్ ఈ కేసు నుంచి సులువుగానే బయటపడవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.