: ధోనీ వస్తానంటే.. గోయెంకా వద్దంటారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ అత్యంత డిమాండ్ కలిగిన క్రికెటర్. గతేడాది దాకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టును రెండు పర్యాయాలు విజేతగా నిలిపారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆ జట్టుపై నిషేధం అమలు కాగా, రాజస్థాన్ రాయల్స్ పైనా బీసీసీఐ వేటు వేసింది. ఈ రెండు జట్ల స్థానంలో పుణే, రాజ్ కోట్ జట్లు బరిలోకి దిగనున్నాయి. నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో పుణేను సంజీవ్ గోయెంకా దక్కించుకోగా, రాజ్ కోట్ ఫ్రాంచైజీని ఇంటెక్స్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ రెంటిలోనూ తక్కువ విలువ కలిగిన బిడ్ దాఖలు చేసిన పుణేకు క్రికెటర్ల ఎంపికలో తొలి అవకాశం దక్కింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రద్దు కావడంతో ఇరు జట్లకు ధోనీ అందుబాటులో ఉన్నాడు. అయితే తక్కువ బిడ్ కోట్ చేసి ఆటగాళ్ల ఎంపికలో తొలి ఛాన్స్ లభించిన సంజీవ్ గోయెంకా ఎగిరి గంతేసి మరీ ధోనీని ఎంచుకుంటాడని అందరూ భావించారు. అయితే, గోయెంకా మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఆటగాళ్ల కూర్పుకు సంబంధించి ఇంకా ఓ స్పష్టతకు రాలేదని చెబుతున్న ఆయన త్వరలోనే దీనికి సంబంధించిన తమ వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ కారణంగా ధోనీ ఏ జట్టుకు ఆడతాడన్న విషయం మరికొన్ని రోజులు ఆగితే కాని తేలేలా లేదు.