: మరో యువ హీరోను పొగిడిన రాంగోపాల్ వర్మ
విమర్శలు ఎక్కుపెట్టడంలో సిద్ధహస్తుడైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ యువ నటుడిని పొగడ్తల్లో ముంచెత్తాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన లోఫర్ ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ తాజాగా ట్విట్టర్లో వరుణ్ తేజ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. వరుణ్ తేజ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకం కాదని చెప్పాడు. వరుణ్ తేజ్ లో తనకు నచ్చే అంశం మెగా ట్రీ నుంచి వచ్చే పవర్ ను ఆశించకపోవడమని అన్నాడు. తాను సొంతంగా సోలార్ బ్యాటరీ తయారు చేసుకుంటాడని చెప్పాడు. అలా ఆధారపడితే ఒక్కోసారి మొత్తం ఎలక్ట్రిసిటీ ఆగిపోయే ప్రమాదం ఉందని వర్మ అభిప్రాయపడ్డాడు. స్టార్ పవర్ అంటే మెగా స్టార్, పవర్ స్టార్ మీద ఆధారపడకపోవడమేనని చెప్పాడు. 'వరుణ్ తేజ్ చెట్టుని గౌరవిస్తాడు కానీ కొమ్మలా బతకాలనుకోడు' అని వర్మ తనదైన స్టైల్ లో కితాబునిచ్చాడు.