: విరాళంగా రూ. 20 లక్షల చెక్కు పంపితే జమ చేసుకోని ఢిల్లీ ఎయిమ్స్!
ఆయన పేరు సంజయ్ చతుర్వేది. ఆయన చేస్తున్న వైద్య సేవలను గుర్తిస్తూ, ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు వచ్చింది. అవార్డు కింద సంజయ్ కి రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది. ఈ డబ్బును ఆయన, తాను పనిచేసిన ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు విరాళంగా ఇవ్వాలని భావించారు. ఇదే విషయాన్ని ఎయిమ్స్ పాలక మండలికి కూడా తెలిపారు. గతంలో సంజయ్ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నాడని, అవినీతికి లొంగడం లేదన్న కక్షతో 12 సార్లు బదిలీ చేసిన అధికారులే ఇప్పుడూ ఎయిమ్స్ లో ఉన్నారు. ఆయన విరాళంగా ఇస్తానంటున్న డబ్బు తీసుకోవడానికి కూడా వేధిస్తున్నారు. తనకు లభించిన డబ్బును తీసుకోవాలని కోరుతూ, సెప్టెంబర్ 21న చెక్కు పంపితే, ఇప్పటికీ దాన్ని వృథాగా పడేశారే తప్ప బ్యాంకులో జమ చేసుకోలేదు. మరో నెల గడిస్తే చెక్కు కాలపరిమితి తీరిపోతుందని గమనించిన సంజయ్, ఆ డబ్బును ప్రధాని సహాయక నిధికి పంపాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు తెలిపారు. తన చెక్కు విషయంలో ఎయిమ్స్ ఈ తరహాలో వ్యవహరించడం కూడా వేధింపుల్లో భాగమేనని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ లేఖ రాశానని ఆయన తెలిపారు. అయితే, సాంకేతిక కారణాల వల్లే చెక్కును డిపాజిట్ చేయలేకపోయామని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ అంటున్నారు.