: గెస్సింగ్ గేమ్... మోదీ, నితీష్ కలుస్తారా?
ఒకప్పటి స్నేహితులు, ఇప్పటి రాజకీయ శత్రువులుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలుస్తారా? కలవరా? దేశ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలను రేపుతున్న ఆసక్తికర ప్రశ్న ఇది. రేపు దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి హాజరవుతారని భావిస్తున్న వీవీఐపీల జాబితాలో నితీశ్ పేరు కూడా ఉంది. ఒకవేళ నితీశ్ వివాహ వేడుకలకు హాజరైతే, బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన తొలి ఢిల్లీ పర్యటన ఇదే అవుతుంది. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా రాజధానికి వస్తే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్య కేంద్ర మంత్రులను కలుసుకోవడం ఆనవాయతీ. ఈ దఫా ఏం జరుగుతుందోన్న ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇద్దరు నేతలూ కలిస్తే, ఎన్నికలకు ముందు ఒకరిపై ఒకరు చేసుకున్న తీవ్ర విమర్శల తరువాత, ఏం మాట్లాడుకుంటారన్నది చర్చనీయాంశమైంది. కాగా, నితీశ్ ప్రస్తుతం స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఢిల్లీ పర్యటన ఇంకా ఖరారు కాలేదని పాట్నా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.