: భారత బులెట్ రైళ్ల కాంట్రాక్టు జపాన్ కు!


ఇండియాలో అత్యధిక వేగంతో వెళ్లే రైళ్ల ప్రాజెక్టును జపాన్ పొందనుందని, ఆ దేశపు ప్రముఖ బిజినెస్ డైలీ 'నిక్కీ' మంగళవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఇండొనేషియాలో హైస్పీడ్ రైళ్ల నిర్మాణ డీల్ పొందేందుకు పోటీ పడి, చైనా రాకతో ఓడిపోయిన జపాన్, ఇండియా కాంట్రాక్టును పొందేందుకు 8.11 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 53 వేల కోట్లు) రుణంగా ఇచ్చేందుకు జపాన్ అంగీకరించిందని తెలిపింది. మొత్తం రూ. 98 వేల కోట్లు అంచనా వ్యయంగా భావిస్తున్న ప్రాజెక్టులో జపాన్ అత్యధిక మొత్తాన్ని రుణ రూపంలో అందించి, పెట్టుబడిగా పెట్టనుందని తెలిపింది. జపాన్ ప్రధాని షింజో అబే గత వారంలో ఇండియాలో పర్యటించినప్పుడు ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించి, వాటిని సఫలం చేసుకున్నారని పేర్కొంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య 505 కిలోమీటర్ల దూరం హైస్పీడ్ రైళ్ల నిర్మాణానికి అనుకూలమని, పెట్టుబడులు త్వరితగతిన వెనక్కు వచ్చేందుకూ అవకాశాలు ఉన్నాయని జపాన్ భావిస్తున్నట్టు తెలిపింది. 2017లో పనులు ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేసి రైలు సర్వీసులు నడిపించాలని జపాన్ భావిస్తున్నట్టు 'నిక్కీ' వెల్లడించింది.

  • Loading...

More Telugu News