: ఎంజీఆర్ బాటలో విశ్వనాథన్ ఆనంద్... వరద బాధితులకు ఇంటిలో ఆశ్రయమిచ్చిన చెస్ లెజెండ్


దశాబ్దాల క్రితం చెన్నైని వరద ముంచెత్తిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎంజీఆర్ తన ఇంటిని వరద బాధితులకు ఇచ్చేసి తాను ఓ హోటల్ కెళ్లి పడుకుండిపోయారు. నాడు ఎంజీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో వందలాది మంది నిరాశ్రయులు ఆయన ఇంటిలో ఆశ్రయం పొందారు. ఎంజీఆర్ మరణానంతరం ఆయన ఇల్లు అనాథ పిల్లలకు ఆశ్రయంగా మారింది. తాజా వరదల్లో ఆ ఇల్లు కూడా నీట మునిగింది. అక్కడి పిల్లలంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా, వరద ప్రవాహానికి ఆయన విలువైన జ్ఞాపకాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే, నాటి ఎంజీఆర్ చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ... వరదలతో సర్వం కోల్పోయిన వారిలో కొంతమందికి భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. ప్రస్తుతం అతడు లండన్ లో జరుగుతున్న టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లగా, ఆయన కుటుంటం మాత్రం చెన్నైలోనే ఉంది. వరద ప్రవాహానికి అతడి ఇంటి సమీపంలోని మురికివాడలు పూర్తిగా కొట్టుకుపోయాయి. తొలుత కొంతమందికి ఆనంద్ కుటుంబం ఆశ్రయమివ్వగా, ఆ తర్వాత వారి ఇంటి పనిమనిషి కూడా తన కుటుంబం సహా వారి ఇంటికి వచ్చేసింది. వరదల్లో ఆనంద్ పనిమనిషి ఇల్లు కూడా కొట్టుకుపోయిందట. ప్రస్తుతం తమ ఇంటిలో ఆశ్రయం పొందుతున్న వారితో పాటు తమకూ కలిపి భారీ స్థాయిలో వంట చేయిస్తున్నామని ఆనంద్ భార్య అరుణ తెలిపారు. టోర్నీ ముగించుకుని వచ్చిన తర్వాత ఆనంద్ తనవంతుగా వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News