: 19న కోర్టుకు రావాల్సిందే... సోనియా, రాహుల్ కు పాటియాలా కోర్టు ఆదేశం


'నేషనల్ హెరాల్డ్' పత్రిక కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు (ఢిల్లీ పెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు) షాకిచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పిన కోర్టు, ఈ నెల 19న జరగనున్న తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీ పిటిషన్లను నిన్న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో నేటి విచారణకు వారు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ సోనియా గాంధీ కూడా కోర్టుకు వెళ్లలేదు. వారిద్దరి తరఫున కోర్టుకు హాజరైన ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తమ నేతలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనికి తిరస్కరించిన కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని తేల్చిచెప్పింది. ఈ నెల 19న జరగనున్న తదుపరి విచారణకు సోనియా, రాహుల్ గాంధీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News