: 'కరోడ్ పతి'లుగా మారిన మరింతమంది భారతీయులు!
ఇండియాలో ధనవంతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గడచిన నాలుగేళ్లలో భారత కోటీశ్వరుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2010-11లో కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 19,716 కాగా, 2013-14లో ఈ సంఖ్య 63,589కి పెరిగిందని, వీరిలో పన్ను చెల్లింపుల అనంతరం సాలీనా కోటికి పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 30 వేల వరకూ ఉంటుందని తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం పరిశీలిస్తే, భారత జనాభాలో 0.5 శాతం మంది కరోడ్ పతి క్లబ్ లో ఉన్నట్టు లెక్క. "స్థూల పన్ను పరిధిలోని ఆదాయం ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించాం. పన్ను రాయితీలు లభించే ఈక్విటీలు, డివిడెండ్ ఆదాయం, బాండ్లు తదితరాలను లెక్కించలేదు" అని కోటక్ ప్రతినిధి అఖిలేష్ తిలోతియా వెల్లడించారు. కాగా, 2013లో రూ. 1 కోటికి పైగా ఆదాయం ఉన్న వారిపై అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం 10 శాతం సర్ చార్జ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని కొనసాగిస్తున్నారు.