: ‘అమ్మ’ కోసం పెళ్లిళ్లు ఆగిపోయాయి!


తమిళ ప్రజలు ‘అమ్మ’గా పిలుచుకునే ముఖ్యమంత్రి జయలలిత రాలేదన్న కారణంగా ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెన్నై మహానగం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత ఆ శుభకార్యాలకు హాజరయ్యే పరిస్థితులు లేకపోవడంతో నిన్న జరగాల్సిన తొమ్మిది పెళ్లిళ్లూ వాయిదా పడ్డాయి. ఈ వివాహాలలో ఒక మంత్రి కూతురి వివాహం ఉండటం గమనార్హం. తమిళనాడు టూరిజం మంత్రి ఎస్.పి.షణ్ముగనాథన్ కూతురు తమిఝార్సి వివాహం పీఎస్ నితిన్ తో నిన్న జరగాల్సి ఉంది. వధువు, వరుడు ఇద్దరూ డాక్టర్లే. వాళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగి సుమారు 18 నెలలు అవుతోంది. అయితే, అక్రమ ఆస్తుల కేసులో జయలలిత గతంలో జైలులో ఉండటం వల్ల, తమ పార్టీ అధినేత జైలులో ఉంటే శుభకార్యం ఎలా నిర్వహిస్తామన్న ఉద్దేశ్యంతో షణ్ముగనాథన్ కూతురు పెళ్లికి నాడు ముహుర్తం పెట్టుకోలేదు. ఆమె నిర్దోషిగా విడుదలైన తర్వాత.. పలుసార్లు జయలలితను సంప్రదించిన తర్వాత నిన్నటి రోజున పెళ్లి ముహూర్తం నిర్ణయించుకున్నారు. రాయపేటలోని వైఎంసీఏ గ్రౌండ్స్ లో ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ పెళ్లి అమ్మ ఆశీర్వాదం లభించదన్న కారణంగా వాయిదా పడింది. పెళ్లి అనంతరం ఒక హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చేందుకూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చెన్నై వరద సహాయక చర్యలు, పలు విషయాలతో తనమునకలై ఉన్న ‘అమ్మ’ రాలేరన్న సమాచారంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, తిరిగి ఏ తేదీన వివాహ ముహూర్తం నిర్ణయిస్తారనేది ఇంకా తేలలేదు. కేవలం ఈ ఒక్క పెళ్లే కాదు ఇంకా ఎనిమిది వివాహాలు ఇదే కారణంగా వాయిదాపడ్డాయి. ‘ఈ వివాహ ముహూర్తాలను నిర్ణయించాల్సింది పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురి అమ్మ కాదు... ‘అమ్మ’ జయలలిత నిర్ణయించాలి’ అని వధూవరుల కుటుంబాలకు చెందిన వారు ఒకరు చమత్కరించారు.

  • Loading...

More Telugu News