: యాడ్స్ లో కనిపించే సచిన్.. పార్లమెంట్ లో కనపడడే?: ప్రశ్నించిన ఎంపీలు
టీవీ యాడ్స్ లో కనిపించే సచిన్ టెండూల్కర్.. పార్లమెంట్ లో కనపడడే? అంటూ రాజ్యసభ ఎంపీలు ప్రశ్నించారు. రాజ్యసభకు ఎంపికైన నామినేటెడ్ సభ్యులు సభలో కనిపించకపోవడంపై ఎంపీలు ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చ లేవనెత్తారు. బాలీవుడ్ నటుడు, రాజ్యసభ్య ఎంపీ (నామినేటెడ్) మిథున్ చక్రవర్తి పలు సమావేశాలకు హాజరుకాకపోవడంపై మొదలైన చర్చ క్రమంగా ఇతర నామినేటెడ్ సభ్యుల వైపునకు మళ్లింది. ఈ నేపథ్యంలోనే టెండూల్కర్, నటి రేఖ గురించి సభ్యులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా జేడీ(యు) సభ్యుడు కేసీ త్యాగి మాట్లాడుతూ, సమావేశాలకు హాజరుకాలేనంటూ మిథున్ చక్రవర్తి చేసిన వినతిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి నామినేటెడ్ సభ్యులు పార్లమెంట్ కు అవసరం లేదని ఆయన విమర్శించారు. ‘భారతరత్న సచిన్.. ప్రైవేట్ కంపెనీల అడ్వర్టైజ్ మెంట్లలో అయితే కనిపిస్తాడు. కానీ, పార్లమెంట్ లో మాత్రం కనపడడు’ అంటూ త్యాగి విమర్శనాస్త్రాలు సంధించారు. రేఖ, మిథున్ చక్రవర్తి, సచిన్ టెండూల్కర్ లు తమకు అనారోగ్యంగా ఉందనో లేదా ఇతరత్రా కారణాలను సూచిస్తూ పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ప్రొసీడింగ్స్, చర్చల్లో వారు పాల్గొనడం లేదంటూ త్యాగి విమర్శించారు.