: ముంబయిలో గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు...ఇద్దరి మృతి!


ముంబయిలోని ఒక మురికివాడలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొన్ని గ్యాస్ సిలిండర్ల వరుస పేలుళ్ల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 1000కి పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. నార్త్ ముంబయి సబర్బన్ ప్రాంతంలోని కాందీవాలి మురికివాడలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో గోడౌన్స్ ఉండటం వలన మంటలను ఆర్పటానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా సీనియర్ అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ, సుమారు 16 ఫైర్ ఇంజన్లు, 12 వాటర్ ట్యాంకులతో ఐదుగురు బ్రిగేడ్ ఆఫీసర్లు సంఘటనా స్థలానికి వెళ్లారన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుగ్గా ఉండటంతో, అక్కడికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ సంఘటనపై ఆ మురికి వాడకు సమీపంలో నివసించే ఒక వ్యక్తి మాట్లాడుతూ, ముందు పెద్ద శబ్దం వినపడిందని, ఆ వెంటనే వరుసగా సుమారు 20 నుంచి 30 సార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు చెప్పాడు.

  • Loading...

More Telugu News