: మాకు కవలలు...వాయుసేనకు వందనాలు: చెన్నయ్ వాసి కృతజ్ఞతలు
చెన్నైలోని రామపురంలోని ఓ అపార్ట్ మెంట్ చుట్టూ పీకల్లోతు నీరు...ఇల్లు వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో నెలలు నిండిన మహిళ, ఆమెకు వైద్యసాయం అవసరం అయింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఆ అపార్ట్ మెంట్ లోని యువకులు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. దీంతో తక్షణం కదిలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన హెలీకాప్టర్ ఆమెను అపార్ట్ మెంట్ లోని ఎత్తైన ప్రదేశంలో నిలబడమని సూచించింది. దీంతో ఆమె అపార్ట్ మెంట్ వాటర్ ట్యాంకుపైకెక్కి నిలబడగా, హెలికాప్టర్ లో వచ్చిన వైమానిక సిబ్బంది ఆమెను లాఘవంగా హెలికాప్టర్ ఎక్కించి, దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆమె కవలలకు జన్మనిచ్చింది. దీనిపై ఆమె భర్త కార్తిక్ ఎయిర్ ఫోర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య దీప్తి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని, ఆమె వరదలో చిక్కుకున్నప్పుడు తాను బెంగళూరులో ఉన్నానని, ఏం చేయాలో పాలుపోలేదని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలని తమ కుటుంబం మర్చిపోలేదని ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, నిండుచూలాలు దీప్తిని వాయు సేన రక్షిస్తున్న వీడియోకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. వాయుసేనకు అభినందనల వర్షం కురుస్తోంది.