: హాలీవుడ్ ప్రవేశం చేస్తున్న దీపికా పదుకునే!
'విన్ డీజిల్ తో కలసి తన తొలి హాలీవుడ్ సినిమా చేస్తున్నందుకు దీపికా పదుకునేకు శుభాభినందనలు' అన్నాడు ప్రముఖ బాలీవుడ్ కమ్ హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. నిన్న దీపికా పదుకునే తన అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా, ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ ను హత్తుకున్న ఫోటోను పోస్టు చేసింది. అయితే ఆ ఫోటోలో విన్ డీజిల్ వెనుక వైపు మాత్రమే మనకు కనిపిస్తుంది. దీంతో అతనెవరు? ఏమా కథ? అంటూ అభిమానులు తెగ ఆలోచిస్తూ వుండిపోయారు. అయితే, ఇర్ఫాన్ ఈ సస్పెన్సుకు తెర దించుతూ, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీజిల్ తో దీపిక కలిసి ఉన్న ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ, ఆ క్యాప్షన్ జోడించాడు. ఇటీవలే దీపిక ఈ హాలీవుడ్ నటుడిని కలిసింది. అది హాలీవుడ్ సినిమా గురించే అయివుంటుందని అంతా ఊహించారు. ఇప్పుడు ఇర్ఫాన్ ఈ వార్తను వెల్లడించడంతో ఆ ఊహ నిజం అయిందనే చెప్పుకోవాలి.