: కేదార్ నాథ్ నుంచి చెన్నై వరకూ... సూపర్ హెర్క్యులస్, గ్లోబ్ మాస్టర్ సేవలు ఎన్నెన్నో!


ఆ విమానాల పేర్లు సీ-130 జే సూపర్ హెర్క్యులస్, సీ-17 గ్లోబ్ మాస్టర్. తమతో పాటు వందల టన్నుల బరువును సులువుగా మోసుకెళ్తాయి. తక్కువ పొడవైన రన్ వేలపై క్షణాల్లో వేగం అందుకుని గాల్లోకి ఎగరడం, అంతే వేగంగా వచ్చి క్షణాల్లో నిలిచిపోవడం, రన్ వే లేకుండా మట్టి దారులున్నా సులువుగా టేకాఫ్, ల్యాండింగ్ వీటి ప్రత్యేకత. హెలికాప్టర్లను, భారీ ట్రక్కులను, టన్నుల కొద్దీ సామాగ్రినీ, చిన్న చిన్న పడవలనూ, వందలాది మందిని ఒకేసారి తీసుకెళ్లే ఈ హెవీ లిఫ్టర్ విమానాలు ఇప్పుడు చెన్నైకి చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో కేదార్ నాథ్ నుంచి వేలాది మందిని తరలించేందుకు సహాయపడ్డ గ్లోబ్ మాస్టర్, సూపర్ హెర్క్యులస్ విమానాలు, నేపాల్ భూకంప సమయంలోనూ తమ వంతు సహాయం అందించాయి. ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సిబందికి సహకరిస్తూ, భారీ పరికరాలు, సహాయ సామాగ్రిని చేరవేయడంలో ఇవి సహకరిస్తుంటాయి. చెన్నై వరదల్లో మునిగిందని, చెన్నై ఎయిర్ పోర్టు మూతబడిందని తెలిసిన వెంటనే తాంబరం ఎయిర్ బేస్, అరక్కోణం నావెల్ బేస్ కేంద్రంగా ఈ విమానాలు దిగిపోయాయి. ఈ నెల 2వ తేదీ నుంచి సేవలందిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమయ్యే చిన్న హెలికాప్టర్లను, బాధిత ప్రాంతాల్లోకి సైన్యాన్ని సులువుగా చేర్చే మర పడవలు, ట్రక్కులను కూడా మోసుకొచ్చాయి. 3 నుంచి 5వ తేదీ మధ్య చెన్నైలో చిక్కుకుపోయిన బయటి వారిని హైదరాబాద్, ఢిల్లీ, పాట్నాలకు చేర్చింది. ఒకేసారి 230 నుంచి 250 మంది వరకూ సులువుగా వెళ్లగలిగే ఈ విమానాలు చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News