: టీఆర్ఎస్ లో దానం చేరికపై ఫ్లెక్సీల ఏర్పాటు, రాత్రికి రాత్రే తొలగింపు... అధినేత తీరుపై అలిగిన దానం!
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరికపై డైలమా కొనసాగుతోంది. పార్టీలో దానం చేరికపై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నేపథ్యంలో నేటి ఉదయం ఈ కార్యక్రమానికి దాదాపుగా రంగం సిద్ధమైందన్న వార్తలు నిన్న వినిపించాయి. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే నగరంలో వెలసిన ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే కనుమరుగయ్యాయి. ఈ ఫ్లెక్సీలను దానం అనుచరులే తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల తొలగింపునకు కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పార్టీ అధినేత సమక్షంలో దానం టీఆర్ఎస్ లో చేరాలని భావించారు. అయితే తన సమక్షంలో కాకుండా పార్టీ కీలక నేత కె.కేశవరావు సమక్షంలో పార్టీలో చేరిపోవాలని దానంకు కేసీఆర్ సూచించారట. దీంతో కంగుతిన్న దానం టీఆర్ఎస్ లో చేరికపై డైలమాలో పడ్డారట. అంతేకాక తనలాంటి సీనియర్ నేత వస్తుంటే, కేసీఆర్ తన కింది స్థాయి నేత వద్ద చేరమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దానం, తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తన అనుచరులకు సూచించారట. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన దానం అనుచర వర్గం ఏర్పాట్లు చేసిన కొద్ది గంటల్లోనే ఫ్లెక్సీలను తొలగించారని వదంతులు వినిపిస్తున్నాయి.