: సైగ చేసినందుకు మురళీ విజయ్ కు జరిమానా
అంపైర్ కు సైగ చేసినందుకు టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ కు ఐసీసీ జరిమానా విధించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ మురళీ విజయ్ కి సఫారీ బౌలర్ మోర్నీ మోర్కెల్ బౌన్సర్ సంధించాడు. దీనిని ఆడేందుకు మురళీ విజయ్ ప్రయత్నించాడు. ఇది మురళీ విజయ్ ఆర్మ్ గార్డ్ ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు గట్టిగా అప్పీలు చేయడంతో అంపైర్ కుమార ధర్మసేన అవుట్ గా ప్రకటించాడు. మౌనంగా క్రీజు వీడాల్సిన మురళీ విజయ్ అంపైర్ కుమార ధర్మసేనకు ఆ బంతి బ్యాట్ ను తాకలేదని, ఆర్మ్ గార్డ్ ను తాకిందని సైగ చేశాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం అంపైర్ అవుట్ అని ప్రకటించిన తరువాత మైదానం వీడాల్సిందే. అక్కడ ఎలాంటి భావ ప్రకటనకు అవకాశం లేదు. దీనిని ధిక్కరించినందుకు మురళీ విజయ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.