: హషీమ్ ఆమ్లా... ది 'గ్రేట్' వాల్!
సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ హషీమ్ ఆమ్లా కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడుతున్నాడు. అనుకూల ఫలితం వచ్చే అవకాశం లేని టెస్టును డ్రాగా ముగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. సఫారీ జట్టు ఓపెనర్ గా సుదీర్ఘ కాలం అందించిన సేవల అనుభవాన్ని రంగరించి టీమిండియాతో నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి వికెట్ గా ఎల్గర్ (4) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన హషీమ్ ఆమ్లా 128 బంతులు ఆడి కేవలం 11 పరుగులు చేశాడంటే ఎంత ఓపికగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. నాలుగో రోజు ఆటను అనుభవంతో అడ్డుకుని, ఐదో రోజును జాగ్రత్తగా హేండిల్ చేస్తే సిరీస్ ముగుస్తుందని భావించిన ఆమ్లా మొక్కవోని దీక్షతో బౌలర్లందరినీ అడ్డుకుంటున్నాడు. దీంతో ఓ ఎండ్ లో ఆమ్లా గోడలా నిలబడగా, రెండో ఎండ్ లో బావుమా (34) వెనుదిరగడంతో డివిలియర్స్ జత కలిశాడు. దీంతో 45 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు నష్టపోయి 49 పరుగులు చేసింది.