: బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీనియర్లు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై వెటరన్ లు విరుచుకుపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్ లో ఇయాన్ ఛాపెల్, బిషన్ సింగ్ బేడీ, గౌతం గంభీర్, రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ, బీసీసీఐలో రాజకీయ ప్రమేయం పెరిగిపోవడంతో పారదర్శకత లోపిస్తోందని అన్నారు. రాజకీయ నాయకులకు స్వస్తి చెబితే బీసీసీఐ ప్రొఫెషనల్ గా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీసీఐలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కమిటీలు ఏర్పాటు చేస్తే అవి ప్రజాదరణ పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. డీఆర్ఎస్ విధానాన్ని బీసీసీఐ ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావడం లేదని ఛాపెల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్ బోర్డులు వ్యవహరించే విధానం ఒకటైతే, బీసీసీఐ అవలంబించే విధానం ఇంకొకటని ఎద్దేవా చేశారు. అనంతరం బిషన్ సింగ్ బేడీ మాట్లాడుతూ, బీసీసీఐ లో జవాబుదారీతనం లేదని మండిపడ్డారు. బీసీసీఐలో పారదర్శకతకు మార్కులు వేయాల్సివస్తే పదికి సున్నా మార్కులు వస్తాయని ఆయన తెలిపారు.