: పెళ్లి విందులో ఆర్డరిచ్చిన ఐటెంలు వడ్డించనందుకు జరిమానా!
ముందుగా అనుకున్న ఆహారపదార్థాలను పెళ్లి విందులో వడ్డించని కారణంగా ఒక వెడ్డింగ్ ప్లాన్ కంపెనీకి జరిమానా విధించిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భిలాయ్ స్టీల్ ప్లాంట్ లోని ఒక అధికారి కూతురి వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన కాంట్రాక్టును సాత్ ఫెరె ఇండియా వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి అప్పగించారు. మూడు రోజుల పాటు నిర్వహించే వివాహ వేడుకకు గాను ఈ కాంట్రాక్టు కుదిరింది. బెండకాయ కూర, అప్పడాలు వడ్డించాలని ముందుగానే అనుకున్నారు. కానీ, ఆ రెండింటిని నిర్వాహకులు వడ్డించలేదు. అంతేకాకుండా, కళ్యాణమండపంపై వధువు, వరుడి పేర్లు రాయలేదని, వేదిక వద్ద ఏర్పాటు చేసిన కుర్చీల్లో వంద కుర్చీలకు కవర్ వేయలేదంటూ వధువు తల్లిదండ్రులు దుర్గ్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఫోరం..వెడ్డింగ్ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.