: కేజ్రీవాల్ కు పరిపక్వత లేదు... తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్
కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీ రవాణా వ్యవస్థను కేజ్రీవాల్ నిర్వీర్యం చేశారని... తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారి విమర్శించారు. కేజ్రీవాల్ కు పరిపక్వత లేదని... ఢిల్లీ ప్రజా రవాణా వ్యవస్థ కెపాసిటీ ఎంతో కూడా ఆయనకు తెలియదని అన్నారు. ఏమీ తెలియకుండానే తుగ్లక్ లా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రజలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థ ఉందా? లేదా? అనేది చూసుకోవాలని అన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం మెరుగ్గా ఉన్న దేశాల్లోనే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం అమలు చేయవచ్చని చెప్పారు. కేజ్రీవాల్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయారని... అందుకే తుగ్లక్ లా చేస్తున్నారని అన్నారు. షీలా దీక్షిత్ హయాంలో అభివృద్ధి చేసిన వ్యవస్థనంతా కేజ్రీవాల్ భ్రష్టు పట్టించారని... చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేజ్రీ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఇందులో భాగంగా వాహనం రిజిస్ట్రేషన్ నంబరులో చివరి సంఖ్యను బట్టి... సరి సంఖ్య నంబర్లున్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య నంబర్లున్న వాహనాలు మరుసటి రోజు... ఇలా రోడు విడిచి రోజు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. బేసి సంఖ్య నంబర్ ఉన్న వాహనాలు తిరిగే రోజు సరి సంఖ్య నంబర్ ఉన్న వాహనాలు ఇంటికే పరిమితం కావాలి. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పై మండిపడింది. ఈ విషయాన్ని పార్లమెంటులో సైతం లేవనెత్తుతామని... ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేంత వరకు కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయం అమలుకాకుండా చూస్తామని ప్రమోద్ తివారి చెప్పారు.