: ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన వరాలు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు పలు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి వివరాలు చూస్తే... రాష్ట్ర ప్రభుత్వానికి రూ.65 వేల కోట్ల ప్రాజెక్టు పనులు కేటాయించామని, వీటిలో ఇప్పటికే 15వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు. రూ.50వేల కోట్ల పనులు వచ్చే ఏడాదిలో మొదలవుతాయన్నారు. రాజధాని చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 180 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. అంతేగాక రాజధాని చుట్టూ 8 లైన్లతో యాక్సిక్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ హైవేలు ఏర్పాటు చేస్తామని గడ్కరీ భరోసా ఇచ్చారు. ఇందుకు అవసరమైన భూ సమీకరణ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే డిసెంబర్ నాటికి డీపీఆర్ ఆధారంగా రూ.8వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1350 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ చేపడతామని, ఇందుకు రూ.13,500 కోట్లు కేంద్రం భరిస్తుందని తెలిపారు. సమగ్ర నివేదిక సమర్పించిన వెంటనే ఆ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇక విజయవాడలో ఎన్ హెచ్ ఏఐ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, కృష్ణా, గోదావరి, బకింగ్ హాం కెనాల్ పై జలరవాణాకు అవకాశాలపై సర్వే చేస్తామని గడ్కరీ వివరించారు. అవినీతిలేని పారదర్శక వ్యవస్థ అమలు చేస్తున్నామన్న గడ్కరీ, దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల ద్వారా రూ.55వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పారు.