: నేను ఆంధ్ర నేతను కాను... తెలుగువాడిని!: వెంకయ్యనాయుడు


తాను ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నేతను కానని... కానీ, తెలుగు వాడినని, తెలుగు బిడ్డనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తన మనసెప్పుడూ తెలుగు నేల గురించే ఆలోచిస్తుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రిగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలకు వీలైనంత ఎక్కువ మేలు కలిగేలా చేయడానికే తాను ప్రయత్నిస్తుంటానని తెలిపారు. ఏపీకి నిధులు తీసుకువచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాని, ఒత్తిడి తెస్తానని, అవసరమైతే పోట్లాడతానని చెప్పారు. ప్రధాని మోదీ ఏపీకి ఎంతో చేస్తున్నారని... ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు. అయితే, అయితే రాత్రికి రాత్రే అన్నీ జరగడం సాధ్యపడదని, క్రమంగా అన్నీ నెరవేరుతాయని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిని సేకరించడంపై కొంత మంది రాద్ధాంతం చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. రోడ్డు వేయాలన్నా భూమి సేకరించాలి, ఫై ఓవర్ నిర్మించాలన్నా, రైల్వే ట్రాక్ వేయాలన్నా, విమానాశ్రయం నిర్మించాలన్నా, చివరకు ఇళ్లు కట్టాలన్నా భూమిని సేకరించాలని... ఇలాంటి పరిస్థితిలో భూసేకరణను రాజకీయం చేయడం తగదని సూచించారు. భూసేకరణ చేయకుండా నిర్మాణాలు చేపట్టే టెక్నాలజీ ఉంటే చెప్పాలని, విమానాశ్రయాలను గాల్లో కట్టే టెక్నాలజీ ఉంటే చెప్పాలని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని వెంకయ్య చెప్పారు. విజయవాడలో ఫ్లైఓవర్లు, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News