: రేపటి నుంచి హైదరాబాదులో 144 సెక్షన్
డిసెంబర్ 6 బ్లాక్ డేను పురస్కరించుకుని హైదరాబాదులో రేపటి నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుందని హైదరాబాదు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి డిసెంబర్ 7 వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులో సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కాగా, 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసనగా ప్రతి ఏటా డిసెంబర్ 6ను ముస్లిం సంస్థలు బ్లాక్ డేను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.