: అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ సిద్ధేశ్ అరెస్టు
ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయడం తెలియని వారిని లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ సిద్ధేశ్ ను శుక్రవారం నాడు గుత్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్ తెలిపారు. కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిద్ధేశ్ చదువును మధ్యలోనే వదిలేశాడు. అల్లరి చిల్లరిగా తిరగడానికి అలవాటు పడిన సిద్ధేశ్ కళ్లు ఏటీఎంలపై పడింది. దీంతో ఏటీఎంల వద్ద కాపు కాచేవాడు. చదువుకోనివారు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేస్తానంటూ నమ్మబలికేవాడు. ఈ నేపథ్యంలో వారి ఏటీఎం కార్డును తీసుకునే వాడు. బ్యాలెన్స్ చూసి సీక్రెట్ నంబరు గుర్తు పెట్టుకుంటాడు. తర్వాత కస్టమర్ ఏటీఎం కార్డును తన జేబులో వేసుకుని, డూప్లికేట్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చేవాడు. వారు అక్కడి నుంచి వెళ్లాక ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసుకునేవాడు. కర్నూల్, గుత్తి, గుంతకల్ లో ఈ తరహా నేరాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏటీఎం దొంగ ఆచూకీ కోసం గత వారం రోజులుగా అన్ని ఏటీఎంల వద్ద పోలీసులు నిఘా వేశారు. ఈ నేపథ్యంలో గుత్తి పట్టణంలోని జయలక్ష్మి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్‌బిఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సిద్ధేశ్ ను పట్టుకున్నామని, తమ విచారణలో అతడే నిందితుడని తేలిందని సీఐ మధుసూదన్‌గౌడ్ తెలిపారు.