: అప్పులు తీర్చేందుకు ఆస్తులను అమ్ముతున్న అనిల్ అంబానీ!
తన నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం)కు చెందిన టవర్, అప్టిక్ ఫైబర్ ఆస్తులను విక్రయించాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టీపీజీ ఆసియా, టిల్ మాన్ గ్లోబల్ సంస్థలతో ఆస్తుల విక్రయ ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా. ఈ డీల్ విలువ రూ. 30 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. సంస్థ గతంలో చేసిన రుణాలను తీర్చేందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగానే ఆస్తుల విక్రయానికి ఆర్ కాం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఆర్ కాం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. ప్రతిపాదిత ఆస్తుల విక్రయంపై 'నాన్ బైండింగ్ టర్మ్ షీట్' పై సంతకాలు చేసినట్టు ఆర్ కాం ఓ ప్రకటనలో వెల్లడించింది. డీల్ విలువపై ఆర్ కాం అధికారిక గణాంకాలను వెల్లడించనప్పటికీ, మొబైల్ టవర్లను రూ. 22 వేల కోట్లకు, ఆప్టిక్ ఫైబర్ ఆస్తులను రూ. 7 వేల నుంచి రూ. 8 వేల కోట్లకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ టెలికం రంగంలో జరిగిన అతిపెద్ద లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.