: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్!


రైలు ఎక్కబోతుండగా కాలుజారి పడ్డ ఒక ప్రయాణికుడు ప్లాట్ ఫారం కు రైలుకు మధ్య ఉన్న గ్యాప్ లో ఇరుక్కుపోయాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితిని గమనించిన ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సంఘటన మహారాష్ట్రలోని కార్జాత్ రైల్వేస్టేషన్ లో జరిగింది. మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కార్జా రైల్వేస్టేషన్ ప్రయాణికులతో హడావిడిగా ఉంది. ముంబయి సీఎస్ టీ నుంచి నాగర్ సోల్ వెళ్లే ఎక్స్ ప్రెస్ (రైలు నంబరు 16339) ఫ్లాట్ ఫారంపైకి వచ్చింది. ఈ ట్రెయిన్ రెండు నిమిషాలు మాత్రమే ఇక్కడ ఆగుతుంది. అయితే, రెండో ఇంజన్ ను జత చేయడం కారణంగా మరో 4 నిమిషాల సేపు రైలు ఆగింది. కోచ్ నంబరు బి-1లో ఎక్కాల్సిన పాండా అనే ప్రయాణికుడు అక్కడే ఉన్న ఒక ఫుడ్ స్టాల్ లో ఆహారపదార్థాలు కొనుగోలు చేసేందుకని నిలబడ్డాడు. ఈలోగా, రైలు కదిలింది. ఈ విషయం పాండా గమనించలేదు. ప్రయాణికులు హడావిడి ఎక్కువయింది. అప్పుడు కానీ, రైలు కదిలిన సంగతి పాండాకు తెలియలేదు. దీంతో, కంగారుపడుతూ రైలు ఎక్కేందుకు పరుగులు తీశాడు. హ్యాండిల్ బార్ పట్టుకుని రైలు ఎక్కబోతున్న పాండా కాలు జారడంతో కిందపడ్డాడు. హ్యండిల్ బార్ ని మాత్రం అట్లానే గట్టిగా పట్టుకుని ఉన్న పాండా, ప్లాట్ ఫారంకు, రైలుకు మధ్య ఉన్న గ్యాప్ లో ఇరుక్కుపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ రూప్ డే వెంటనే రంగంలోకి దూకాడు. పాండాను రక్షించాడు. అంతేకాకుండా, రైలు గార్డుకు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అయితే, ఈ ప్రమాదంలో పాండాకు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పాండాను ఆ రైల్లోనే ఎక్కించి పంపారు. ఇదంతా ప్లాట్ ఫారంపై ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఈ సంఘటనపై రైల్వే అధికారులు మాట్లాడుతూ, కానిస్టేబుల్ తీసుకున్న తక్షణ నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడిందన్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని, అతనికి అవార్డు విషయమై సిఫారసు చేస్తామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News