: ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సీరియస్... రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) ఈరోజు మండిపడింది. ఆదాయమే లక్ష్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. తవ్వకాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని పేర్కొంది. అంతేగాక భూగర్భ జలాలు అడుగంటుతాయని ఎన్ జీటీ తెలిపింది. కాబట్టి ఇసుక తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు పాటించాలని సూచించింది. అనంతరం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఎన్ జీటీ జనవరి 7కు వాయిదా వేసింది.