: వందల కోట్లు సంపాదించి, ముష్టి వేస్తారా?... వర్షాన్ని రజనీకాంత్ ఎందుకు ఆపలేకపోయారు?: వర్మ
సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్లు, సెలబ్రిటీలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వందలాది కోట్ల రూపాయలను సంపాదించిన సూపర్ స్టార్లు చెన్నై వరద బాధితుల సహాయార్థం 5 లక్షలు, 10 లక్షలు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలను, టన్నుల కొద్దీ ప్రేమను పంచుతున్న సూపర్ స్టార్లు డబ్బు విషయంలో మాత్రం చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ప్రేమ, ప్రార్థనలైతే చాలా చీప్ అని... అదే డబ్బు అయితే చాలా విలువైందనేది సూపర్ స్టార్ల భావన అని ఎద్దేవా చేశారు. లక్షలు ఇవ్వడం కంటే, అసలు ఇవ్వకుండా ఉండటమే బెటర్ అంటూ సూచించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ వర్షాన్ని ఆపలేకపోవడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సెటైర్ వేశాడు. చెన్నై ఉపద్రవానికి దేవుడే కారణమని... ఆయన వల్లే వర్షాలు కురిశాయని... అందువల్ల దేవుడిని ప్రార్థించడం మానేసి, విమర్శించాలని వర్మ సూచించాడు. దేవుడి పని టెర్రరిస్టుల చర్యల కన్నా దారుణంగా ఉందని మండిపడ్డారు. రాయటానికి వీలు లేని భాషలో తాను దేవుడిని తిడుతున్నానని చెప్పాడు. ప్రజలను కష్టపెట్టే దేవుడిని ప్రార్థించడం మానేసి... ఇప్పటికైనా ఎవరిమీది వారు నమ్మకం పెంచుకోవాలని సూచించాడు.