: జూనియర్ బచ్చన్ సాహసం...వర్షంలోనే బస్సులో రేణిగుంటకు బాలీవుడ్ స్టార్


తాను ప్రమోట్ చేసిన ఇండియన్ సూపర్ లీగ్ ఇంకా ముగియలేదు. టోర్నీలో భాగంగా తన జట్టు దేశంలోని పలు నగరాలకు వెళుతోంది. జట్టు యజమానిగా తాను ఆయా నగరాలకు వెళ్లక తప్పలేదు. ఇలా మొన్న చెన్నైకి వచ్చిన బాలీవుడ్ బిగ్ బీ తనయుడు, యువ హీరో అభిషేక్ బచ్చన్ అక్కడి వరదల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. చోటా బచ్చన్ తో పాటు అతడి జట్టు క్రీడాకారులు కూడా అక్కడే చిక్కుబడిపోయారు. వరదల్లో చిక్కుకున్నా... తాను, తన టీం ప్లేయర్స్ క్షేమంగానే ఉన్నామంటూ అతడు నిన్న ట్వీట్ చేశాడు. అయితే లీగ్ లో తదుపరి మ్యాచ్ ల కోసం జట్టుతో పాటు తాను కూడా చెన్నై నుంచి బయటకు రాక తప్పలేదు. అయితే అక్కడి నుంచి వచ్చేందుకు విమానాలు లేవు. బస్సులు లేవు. రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. చెన్నై నుంచి బయటపడే మార్గంపై సుధీర్ఘంగా ఆలోచించిన అతడికి చెన్నైకి సమీపంలో ఉన్న రేణిగుంట విమానాశ్రయం గుర్తుకు వచ్చింది. రేణిగుంటకు వచ్చేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణించక తప్పదు. ఓ వైపు జోరుగా కురుస్తున్న వర్షం. మరో వైపు ఎక్కడికక్కడ ఆగిన రవాణా. వీటన్నిటిని ఏమాత్రం లెక్క చేయని చోటా బచ్చన్ తన జట్టు క్రీడాకారులను బస్సులోకి ఎక్కించాడు. తనూ ఎక్కాడు. నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి వారు చోటా బచ్చన్ ను చూసి చుట్టుముట్టేశారు. వారి అభిమానం నుంచి బయటపడ్డ బచ్చన్ జూనియర్ రాత్రి ఏడుగంటలకు స్పైస్ జెట్ విమానం ఎక్కి నేరుగా ముంబై వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News