: చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు.. ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు!
చనిపోయాడనుకున్న కొడుకు గున్న... పద్దెనెమిది ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. దీంతో, తల్లి చంద్రమ్మ ఆనందానికి హద్దుల్లేవు. 'ఇది నిజం!' అని తాను నమ్మలేకపోతున్నానంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దందలో నిన్న జరిగింది. అయితే, ఇన్ని రోజులుగా గున్న ఎక్కడికెళ్లాడు, ఏమి చేశాడన్న విషయాలపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. కానీ, గున్నను తల్లి వద్దకు చేర్చిన శ్రద్ధ రిహేబిలిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు కొన్ని విషయాలు చెప్పారు. మతిస్థిమితం కోల్పోయిన అతన్ని మూడు నెలల క్రితం మహారాష్ట్ర బస్టాండ్ లో చూశామని, అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని ముంబయి ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించామని అన్నారు. అతని మానసిక పరిస్థితి బాగుండలేదన్న విషయం అప్పుడు బయటపడిందన్నారు. సైకియాట్రిక్ ట్రీట్ మెంట్, కౌన్సెలింగ్ కూడా అతనికి ఇప్పించామన్నారు. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దందకు చెందిన కె.కృష్ణయ్య అలియాస్ గున్నకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. 1997 లో గున్న తప్పిపోయినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతను తిరిగి వస్తాడేమోనని చెప్పి కొన్ని రోజుల పాటు ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. దీంతో, వెల్దంద పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సంవత్సరాలు గడిచాయి కానీ, కొడుకు గురించిన సమాచారం ఏమాత్రం తెలియలేదు. గున్న తండ్రి పుల్లయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. గున్న తిరిగొస్తాడన్న ఆశ వదులుకున్నారు. దాంతో పదేళ్లు గడిచిన అనంతరం వెల్దంద తహశీల్దార్ నుంచి గున్న మరణించినట్లు ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నట్లు చంద్రమ్మ చెప్పింది. ఇంతలో కొడుకు ప్రత్యక్షమవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు.