: వరదనీటి నుంచి బయటపడేందుకు... కేపీకే నగర్ వాసుల సమయస్ఫూర్తి !
చెన్నైలోని పెరుంగుడిలో ఉన్న కేపీకే నగర్ వాసులు బుధవారం ఉదయం ఉన్నపళంగా లేచి కూర్చున్నారు. వరదనీరొచ్చి వారిపై పడటంతో అప్పుడు అర్థమైంది వారికి... వరదప్రవాహం పెరిగిందని. మొన్న రాత్రి నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. అయితే, ఈ విషయం కేపీకే వాసులకు తెలియదు. ఎందుకంటే, అప్పటికే వాళ్లల్లో కొందరు నిద్రలోకి జారుకోగా, మరికొందరు కునుకుపాట్లు పడ్డారు. దాదాపు ఆ ప్రాంతమంతా జలమయమవడంతో, అక్కడి నుంచి బయటపడితే కానీ, లాభం లేదనుకున్నారు. కానీ, ప్రభుత్వ సహాయక బృందాలు ఎప్పుడొస్తాయో తెలియదు.. ఎదురు చూసే సమయమూ లేదు. దీంతో కేపీకే వాసుల బుర్ర పాదరసంలా పని చేసింది. వాళ్ల దగ్గర ఉన్న పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను, నీటిపై తేలే తత్త్వం ఉన్న వస్తువులను పెద్ద పాలిథిన్ బ్యాగ్ లో వేసి మూటగా చుట్టారు. పాలిథిన్ బ్యాగ్ ల కింద ఒక చెక్కను ఉంచి తాళ్లతో కట్టారు. ఆ మూటపై ఎక్కి కూర్చుని అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మొదట, చిన్న పిల్లలను, ముసలి వారిని, మహిళలను తేలియాడే మూటలపై ఎక్కించారు. ఆ మూటలకు ఉన్న తాళ్లను చిన్నగా లాక్కుంటూ వెళ్లి వారిని మైదాన ప్రాంతంలో విడిచిపెట్టారు.