: తమిళనాడులో మరో ఏడు రోజుల వరకు వర్షం: వాతావరణ శాఖ డీజీ
తమిళనాడును ఇప్పుడిప్పుడే వర్షాలు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. మరో 7 రోజుల వరకు వర్షం కొనసాగుతుందని, వచ్చే రెండు రోజులు కీలకమని జాతీయ వాతావరణ శాఖ డీజీ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితుల్లో భారీ వర్షం పడనుండటం ఆందోళనకర అంశమని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీ సూచించారు. మరోవైపు చెన్నై నగరంలో గత మూడు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షం ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. దాంతో ఉదయం నుంచి నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.