: మహిళతో ఏకాంతంగా కేరళ సీఎం, పార్టీ నేతలు... వీడియోలు ఉన్నాయంటున్న 'సోలార్ స్కాం' నిందితుడు
కేరళలో పెను ప్రకంపనలకు కారణమవుతున్న సోలార్ స్కాం మరో బాంబును పేల్చింది. సోలార్ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో పాటు ఆయన పార్టీకి చెందిన నేతలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి చాందీ, ఆయన అనుచరులు తేరుకోకముందే, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తి నిన్న సంచలన ప్రకటన చేశారు. అది కూడా ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు ఆయన ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. అసలు కమిషన్ కు రాధాకృష్ణన్ చెప్పిన విషయమేమిటంటే... సీఎం ఉమెన్ చాందీ, ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నేతలు సరితా నాయర్ అనే మహిళతో ఏకాంతంగా గడిపారట. నాయర్ తో చాందీ, మిగిలిన నేతలు వేర్వేరుగా ఏకాంతంగా గడిపిన వీడియో టేపులు కూడా తన వద్ద ఉన్నాయని కూడా రాధాకృష్ణన్ కమిషన్ కు చెప్పారు. అనుమతిస్తే వాటిని కమిషన్ కు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసులో సరితా నాయర్ కూడా అరెస్టయ్యారు. అరెస్ట్ కావడానికి ముందు నాయరే స్వయంగా ఆ వీడియోలు తనకు ఇచ్చిందని ఆయన చెప్పారు. మొత్తం ఆరు వీడియోలు ఉన్నాయని, వాటిలో ఐదింటిని సీఎం ఉమెన్ చాందీకి చూపించానని, ఆరో దాంట్లో స్వయంగా చాందీనే ఉండటంతో ఆయనకు దానిని చూపించలేదని రాధాకృష్ణన్ కమిషన్ కు చెప్పారు. ఇదిలా ఉంటే, దీనిపై సరితా నాయర్ భగ్గుమన్నారు. రాధాకృష్ణన్ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. దమ్ముంటే ఆ వీడియోలను బహిర్గతం చేయాలని ఆమె సవాల్ చేశారు. మరోవైపు ఈ విషయంపై అటు ఉమెన్ చాందీ కానీ, ఆయన పార్టీ నేతలు కాని నోరు విప్పలేదు. ప్రస్తుతం ఈ భాగోతం కేరళలో పెను దుమారం రేపుతోంది.